భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు
* రోజూ 10వేల మందికే అమ్మ దర్శనం
* కోవిడ్ దృష్ట్యా గిరి ప్రదక్షణ, నదీస్నానాలు రద్దు
* భవానీ దీక్షా విరణమ ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించిన దుర్గగుడి చైర్మన్, ఈవో
ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వచ్చే ఏడాది జనవరి 5నుంచి 9వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు చెప్పారు. శనివారం ఉదయం మల్లిఖార్జున మహామండపంలోని 6వ అంతస్థులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారివురూ మాట్లాడారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణ ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌ను దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు ప్రారంభించారు. పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు మాట్లాడుతూ భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ దృష్ట్యా భవానీ దీక్ష ధరించి వచ్చే భక్తులను రోజుకు 10వేల మందిని మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. అలాగే కొండ చుట్టూ గిరి ప్రదక్షణను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేలు ఉచిత దర్శనం టిక్కెట్లు, రూ.100 టిక్కెట్లు 1000 ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి భక్తుడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే, అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడి తప్పనిసరని పేర్కొన్నారు. ఆన్లైన్ టిక్కెట్లను www.kanakadurgamma.org వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 నుంచి
రాత్రి 8గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. అమ్మవారి మాలధారణ ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలని, నదీ స్నానానికి కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ఈఓ సురేష్‌బాబు మాట్లాడుతూ ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక పార్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి గిరిప్రదక్షిణ చేయనున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యులు, పాలక మండలి సభ్యులు కె.వెంకటరమణ, కె.రాజ్యలక్ష్మి, ఎన్.అంబిక తదితరులు పాల్గొన్నారు.