Published On: Mon, Nov 30th, 2020

సమర్థవంతమైన సేవల‌తో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాం…

* అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ హసన్ రెజా

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: నివర్ తుపాన్ సమయంలో అధికారులు, సిబ్బంది సమర్ధవంతమైన సేవలు నిర్వర్తించి ప్రజల ప్రాణ, ఆస్థి నష్టాలను నివారించారని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ హసన్ రెజా చెప్పారు. నివర్ తుపాన్‌లో రాష్ట్రంలోనే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో అగ్నిమాపకశాఖ అందించిన సేవలపై శుక్రవారం హసన్ రెజా విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ నివర్ తుపాన్ ప్రభావం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అత్యధికంగా ఉందన్నారు. అనేకచోట్ల రహదారులు దెబ్బతినడంతో పాటు భారీ వృక్షాలు నేలకొరిగాయన్నారు. ఈ సమయంలో అగ్నిమాపక సిబ్బంది 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారన్నారు. నెల్లూరు జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 32, కడపజిల్లాలో 22, అనంతపురంలో 10, ప్రకాశం జిల్లాలో 11 బృందాల్లో 527 మంది రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసారన్నారు. కడప జిల్లాలో నదిలో పడి కొట్టుకుపోతున్న ఓ యువతిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారని కితాబిచ్చారు. శ్రీకాళహస్తి వరదల్లో చిక్కుకున్న ఇద్దరు రైతులను సిబ్బంది రక్షించారని, స్థానిక ఎమ్మెల్యే స్పందించి రూ.లక్ష సిబ్బందికి బహుమానాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. యస్‌టిఆర్ఎఫ్‌, యన్‌డిఆర్ఎఫ్ బృందాలు కన్నా స్థానికంగా ఉన్న అగ్నిమాపక సిబ్బందికి ఆయా ప్రాంతాలపై అవగాహన ఉండడంతో తక్షణమే రక్షణ చర్యల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచబ్యాంకు నిధుల సహకారంతో 476 మంది సిబ్బందికి రక్షణ చర్యలకు సంబంధించిన వివిధ అంశాలలో శిక్షణ అందించడం జరిగిందన్నారు. అగ్నిమాపకశాఖ డైరెక్టరు కె.జయరామ్ నాయక్ మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో అగ్నిమాపక శాఖను డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో చేర్చడం జరిగిందన్నారు. ఎటువంటి విపత్తు సంభవించినా అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్‌లో ముందుండి రిస్క్యూ చేసి ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. 2015వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 4724 రిస్క్యూ మరియు ఎమర్జెన్సీ కాల్స్ అందుకుని 6104 మంది ప్రాణాలను కాపాడడం జరిగిందని ఆయన వివరించారు. నివర్ తుఫాన్ చర్యల్లో భాగంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైయస్ఆర్ కడప,
అనంతపురం జిల్లాల్లో 528 మంది సిబ్బందితో పాటు 10 బోట్లు, 113 పవర్ సాస్, 25 ఆస్కా లైట్స్, 62 పోర్టబుల్ పంప్స్, 154 మంది లైఫ్ బాయ్స్, 185 లైఫ్ జాకెట్స్, 227 రోమ్, 9 ఫ్లోటింగ్ పంప్స్, ఒక లాజిస్టిక్ వెహికల్‌ను ఏర్పాటు చేసి సహాయక చర్యలను అందజేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో అగ్నిమాపక శాఖ అడిషినల్ డైరెక్టరు డి.మురళీమోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...