Published On: Wed, Dec 2nd, 2020

శ‌స్త్ర‌చికిత్స జ‌రిగిన రోజునే డిశ్చార్జి..!

* షార్ట్ స్టే సేవలతో త్వరగా కోలుకునే అవకాశం

* కామినేనిలో డే-కేర్ యూనిట్ ప్రారంభం

* కరోనా నేపథ్యంలో అందుబాటులోకి షార్ట్ స్టే సేవలు

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: నిన్నమొన్నటి వరకు అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక వైద్య సేవలు ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. యుఎస్, యూకే తదితర పాశ్చాత్య దేశాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విజ్ఞానాన్ని కామినేని హాస్పిటల్స్ లాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు అన్నివర్గాల ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నాయి. వైద్య రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక చికిత్సా విధానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ రోగులకు మెరుగైన సేవలను అందించడంలో కామినేని హాస్పిటల్స్ ముందంజలో ఉంది. కరోనా కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నవ్యాంధ్రలోనే ప్రప్రథమంగా కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో డే-కేర్ యూనిట్‌ను ప్రారంభించారు. షార్ట్ స్టే యూనిట్‌గా పిలవబడే ఈ ప్రత్యేక వైద్య సేవల గురించి వివరించేందుకు కామినేని వైద్యులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రఖ్యాత సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గొర్తి గణేష్ మాట్లాడుతూ జీర్ణకోశ క్యాన్సర్ సర్జరీలు, లివర్ సర్జరీలు, గాల్ బ్లాడర్ సర్జరీలు, పాంక్రియాస్ సర్జరీలు, చిన్నప్రేగు, పెద్దపేగు సర్జరీలు, అపెండిసైటిస్, లాపరోస్కోపిక్ సర్జరీలు, కడుపులో గడ్డలు, బేరియాట్రిక్ సర్జరీలు, ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన ఆపరేషన్లను డే-కేర్ యూనిట్ ద్వారా నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన డే-కేర్ యూనిట్ ద్వారా ఆపరేషన్ చేసిన రోజునే పేషేంటును డిశ్చార్జి చేస్తామని అన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా సమీక్ష జరిపిన తర్వాత షార్ట్ స్టే విధానంలో సర్జరీ నిర్వహిస్తామని, నిర్దిష్టమైన పరీక్షల అనంతరం ఆపరేషన్ చేసిన రోజునే రోగిని డిశ్చార్జి చేస్తామని వివరించారు. డే-కేర్ సర్జరీల ద్వారా రోగి త్వరగా కోలుకునే వీలు కలుగుతుందని, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల బారినపడకుండా రోగికి రక్షణ లభిస్తుందని అన్నారు. రోగిని వెంటనే డిశ్చార్జి చేయడం వల్ల కుటుంబసభ్యులకు హాస్పిటల్ చుట్టూ తిరిగే ఇబ్బంది నుండి ఉపశమనం కలుగుతుందని, ఇంటి వద్ద అలవాటైన వాతావరణంలో ఉండటం ద్వారా రోగులు త్వరితగతిన కోలుకోగల‌ర‌ని డాక్టర్ గొర్తి గణేష్ పేర్కొన్నారు. కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ నవీన్‌కుమార్ వెనిగళ్ల మాట్లాడుతూ తమ హాస్పిటల్లోని అత్యాధునిక గ్యాస్ట్రో సర్జరీ విభాగం ద్వారా డే-కేర్ సేవలను అందిస్తున్నామని, నిష్ణాతులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సర్జరీ విభాగం ద్వారా అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో డే-కేర్ సర్జరీ యూనిట్‌ను ప్రారంభించామని డాక్టర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. సమావేశంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పవన్ వెలినేని మాట్లాడుతూ డే-కేర్ సేవల ద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయని, ఆపరేషన్ అనంతరం రోగి సౌకర్యవంతంగా ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకోవచ్చ‌ని తెలిపారు. కామినేని హాస్పిటల్స్ జనరల్ సర్జన్ డాక్టర్ దీప్తి ప్రవల్లిక మాట్లాడుతూ రోగుల 24 గంటల నిరంతర సేవలందించేందుకు తమ హాస్పిటల్లోని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సర్జరీ విభాగానికి చెందిన నిష్ణాతులైన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, సీనియర్ రేడియాలజిస్ట్, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. షార్ట్ స్టే యూనిట్ ద్వారా రోగులకు అత్యాధునిక సేవలను అందుబాటులో తీసుకురావడం హర్షణీయమని డాక్టర్ దీప్తి ప్రవల్లిక పేర్కొన్నారు.

 

Just In...