Published On: Wed, Dec 2nd, 2020

మోదీ చేసిన అభివృద్ధి అండ‌తో అధికారం సాధిస్తాం..

* భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రానికి మోదీ చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి రాజ్యాధికారం సాధిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. భాజపా విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడిగా ఎన్నికైన‌ బొబ్బూరి శ్రీరాం ప్రమాణస్వీకార కార్యక్రమం బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని వెటర్నరీ కాలనీలో ఓ ప్రైవేటు పంక్ష‌న్ హాల్‌లో జ‌రిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. అమరావతి కోసం ప్రధాని ఎన్నో కార్యక్రమాలు అమలుచేశారని చెప్పారు. అమరావతిని చుట్టి రహదారులు, రైల్వేలైన్లు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, మౌలికసదుపాయాలు ఎన్నో కేటాయించారని అన్నారు. కానీ.. అమరావతికి ఏం చేయలేదని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, దానిని పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. మోదీ చేసిన అభివృద్దే భాజపాకు బలమని, దానిని ప్రజలకు వివరించడం ద్వారా వారికి దగ్గ‌రై రాష్ట్రంలో అధికారం సాధించాలని సూచించారు. కేంద్రం రాష్ట్రంలో 35 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది. వాటిని లబ్ధిదారులకు చేరవేయడంలో గత ఇప్పటి ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల ఖర్చుపై జరిగే అవకతవకలను భాజపా కార్యకర్తలు పరిశీలించి ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర పథకాల అమలులో తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షల ఆర్ధిక సహాయం చేస్తుంది. ఆడబ్బు రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయకుండా ప్రజలకు ఇస్తే వారు నాణ్యతతో కట్టుకుంటారు. చంద్రబాబు 3.30 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణానికి రూ.22000 వేల కోట్ల ఖర్చును అంచనా వేశారు. రూ.3 లక్షలు ఖర్చుచేస్తే 300 చ.అ.ఇల్లు నిర్మించవచ్చు. కాని రూ. 8 లక్షల వరకు ఖర్చుచేశారు. లబ్దిదారులు నెలకు రూ.2 వేల చొప్పున బ్యాంకులకు 20 ఏళ్లపాటు చెల్లించేలా వారిని రుణగ్రస్తులను చేశారు. చంద్రబాబు టిట్కో ఇళ్ల నిర్మాణంపై జరిగిన అవినీతి, వాటి వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలి. జగన్ తన పాదయాత్రలో 300 చ.అ. ఇళ్లకు తానే డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టారు? ఎన్ని కేటాయించారో చెప్పాలి. భాజపా కార్యకర్తలు కేంద్రం ఇచ్చే పథకాలు, కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలి. జగన్ ప్రభుత్వం ఇచ్చే 30 లక్షల పట్టాల్లో కట్టే ఇళ్లకు చేసే ఖర్చులో సింహభాగం కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి కేటాయించినవే. రూ.3 వేల కోట్ల నరేగా నిధులతో మరుగుదొడ్లు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి కనెక్షన్లు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సిఎంల ఫొటోలు తప్ప ఏం ఖర్చు పెట్టడం లేదు. ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఖర్చుచేసిన రూ.7 వేల కోట్లలో రూ.2 వేల కోట్లు అవినీతి జరిగింది. రాజమండ్రిలో రూ.150 కోట్లతో చేసిన భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగింది. నెల్లూరు మరో ఉదాహరణ. అవినీతిలో రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి సాటిగా ఉన్నాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలని భాజపా డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు రూ.7,200 కోట్లు ఖర్చుచేసి ఏం చేయలేదు. రూ.1,800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్‌ను అద్భుతంగా కడితే రాజధానికి ఏం చేయలేదని అంటున్నారు. చంద్రబాబు, జగన్ ఎయిమ్స్ ను చూడాలి. ఇక్కడే రాజధానిని కడతాం. రాజధానికై రైతాంగం 40 వేల ఎకరాచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేసి భూములిచ్చిన వారికి 64 వేల పట్టాలివ్వాలి. మిగిలిన 9 వేల ఎకరాలు అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే భాజపా కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నాం. భాజపా సకల జనుల పార్టీ. కుల, మత, వర్గం పై బాజపాకు అభిలాష లేదు. దేశం, జాతిని ప్రేమించి, పునర్నిర్మాణం చేయడం భాజపా సిద్ధాంతం, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి మన ప్రధానిగా ఉన్నారు. చంద్రబాబు, జగన్‌ల‌వి కుటుంబ పార్టీలు. వారికి ద్వేషాలుంటాయి. మనకు రాగద్వేషాలు లేవు. అందుకే రాజధానిని అమరావతిలో కడతామని చెప్పి విశాఖకు తీసుకెళ్లిపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భాజపా అధ్యక్షుడిగా ఉన్న రామారావు 500 మంది ముస్లింలను చార్మినార్ వద్దకు తీసుకెళ్లి వందేమాతరం పాడించారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా కాకుండా దేశభక్తులుగా మార్చిన ఘనత భాజపాదే. అందుకే మరణించాక స్థలం కూడా ఇవ్వమని బెదింరిపులు ఎదురైనా, ఎన్నో కష్టాలను తట్టుకుని షేక్ సైదా, షేక్ బాజీ వంటి వారు మనతో కలసి పనిచేస్తున్నారు. ఎవరికో సిఎం పదవి, రాజ్యాధికారం ఇచ్చేందుకు మనం అధికారం కోరుకోవడం లేదు. రాష్ట్రాభివృద్ధికే అధికారం కోరుతున్నాం. రాజధాని విషయంలో కేంద్రం కలుగచేసుకోవడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. మోదీ కలుగచేసుకుంటేనే అమరావతి రాజధానికి నిధులు, కనకదుర్గ పైవంతెన నిర్మాణం, విజయవాడ చుట్టుపక్కల, పరిసరాల్లో, రాష్ట్రంలో ఆరులైన్ల రహదారులు, కృష్ణానదిపై 3 వంతెన, విజయవాడ నుంచి చెన్నైకు మూడో రైల్వేలైన్, అమరావతి నుంచి అనంతపురం వరకు ఆరులైన్ల ఎక్ పెస్ వే నిర్మాణం వంటివి జరుగుతున్నాయి. మోదీ కలుగచేసుకోకుంటే అవి జరిగేవా? చంద్రబాబు రూ.7,200 కోట్లు తీసుకుని ఎయిమ్స్ వంటి భవనం ఒక్కటీ కట్టలేదు. దీనిపై ఆయనను ఎవరూ ప్రశ్నించలేదు. ఇది జగన్, చంద్రబాబు చేయగలడా? రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు 200 వరకు చెప్పగలం. భాజపా ఎంతో బాగా పనిచేస్తుంటే ఇంకాం ఏం కావాలి. రాష్ట్రానికి చేసిన అభివృద్దే భాజపా బలం. ఇదే మోదీ సంకల్పం. గ్రామం, పోలింగ్ బూత్‌ల వరకు ఈ అభివృద్ధిని తీసుకెళ్లి విజయం సాధిస్తాం. . కేంద్రం నిధులతోనే రాష్ట్ర పథకాలు ఈ పార్టీలు ఏం చేశాయని చెప్పుకోగలవు? రాష్ట్రంలో నిర్మించే 16 బోధనాసుపత్రులకు ఒక్కోదానికి రూ. 50 కోట్లు కేంద్రం కేటాయింస్తోంది. పాఠశాలలు, గ్రామపంచాయతీలు, రైతు భవనాలు, మరుగుదొడ్లు, శ్మశానవాటికలకు గోడలు, వర్మికంపోస్టులు, చెట్లు నాటడం వరకు రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ నరేగా, సర్వశిక్షా అభియాన్ నిధులతో జరుగుతున్నవే. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి నవరత్నాలు ఇస్తుంటే, భాజపా అభివృద్ధి చేస్తూ, ఆదాయం పెంచుతూ, ప్రజలకు బంగారురత్నాలు ఇస్తోంది. ఎపీని స్వర్ణమయం చేస్తుంది. నిమ్మకూరులో రూ. 500 కోట్లతో డిఫెన్స్ సంస్థను నిర్మిస్తున్నారు. నాగాయలంకలో వెయ్యి కోట్లతో రక్షణ మంత్రిత్వ శాఖ మిసైల్ వాచింగ్ సెంటర్‌ నెలకొల్పుతోంది. విజయవాడలో ఫ్యాషన్ డిజైన్ వర్శిటీ ప్రారంభించాం. విజయవాడలో, చుట్టుపక్కల మోదీ ఉన్నారు. మోదీ జోక్యంతోనే ఇవన్నీ వచ్చాయని సూటిగా చెబుతున్నాం. పోలవరం, ఈబీసీ, రాష్ట్రంలో గ్రామం వరకు జరిగే అభివృద్ధి విషయాలు, విజయవాడనగరం, పార్లమెంటు ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని భాజపా కార్యకర్తలు అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోవాలి. లబ్ధిదారులకు 60 గ్రాముల కోడిగుడ్డు ఇవ్వాలనేది భాజపా లక్ష్యం. ఇవి ఇవ్వలేని చంద్రబాబు, జగన్ నవరత్నాలు ఇస్తానంటున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ, వాటిని పరిష్కరించేందుకు కార్యకర్తలు పోరాడాలి. విజయవాడ పార్లమెంటు అధ్యక్షులు బొబ్బూరి శ్రీరాంకు సహకారం అందించాలి. రాష్ట్రంలోని దెబ్బతిన్న రహదారులను నిర్మించాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 5న భాజపా తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొనాలి. ఆరో తేదీన అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు చేయాలి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమన్నారాయణ, సీనియర్ నాయకులు షేక్ సైదా, చిగురుపాటి కుమారస్వామి, రామినేని వెంకటకృష్ణ, దాసం ఉమామహేశ్వరరాజు, అడ్డూరి శ్రీరాం, తోట శివనాగేశ్వరరావు, ఆర్ముగం, అడపా శివనాగేంద్రరావు పాల్గొన్నారు. 

Just In...