Published On: Wed, Dec 2nd, 2020

ప్రాజెక్టు ఎత్తు ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించం ..

* కచ్చితంగా 45.72 మీటర్లు కడతాం, పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేస్తాం

* 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి సాగు నీరందిస్తాం

* శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటన

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి సభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌కు, విపక్షనేత చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసత్య ప్రచారం చేస్తున్న విపక్షనేత వైఖరిని మంత్రి అనిల్‌కుమార్‌ ఎండగట్టారు. ఆ తర్వాత సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం వైయస్‌ జగన్, అసలు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? గత ప్రభుత్వం హయాంలో ఏం జరిగింది? ఇప్పుడు తాము ఏ విధంగా పనులు కొనసాగిస్తున్నామన్న వాటిని కూలంకషంగా వివరించారు. సీఎం ప్రసంగాన్ని మరోసారి టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో, వారిని ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు. తమ మాటలు బయటకు పోవద్దన్న కుట్రతోనే విపక్ష సభ్యులు అలా ప్రవర్తిస్తున్నారని, వారికి దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూడో రోజు బుధ‌వారం జ‌రిగిన స‌భ‌లో పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..

పోలవరం ప్రాజెక్టు ఒక కల..
‘పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్రానికే ఒక వరం. గతంలో ఎందరో సీఎంలు అయ్యారు. కానీ ఏ ఒక్కరూ కూడా ప్రాజెక్టును పరుగెత్తించాలని, పనులు చేయాలని అనుకోలేదు’. ‘ఇదే చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నాడు. కేంద్రంలో కూడా చక్రం తిప్పానని చెప్పుకున్నాడు. కానీ ఏనాడూ పోలవరం గురించి పట్టించుకోలేదు. పక్కన కర్ణాటకలో అల్మట్టి ఎత్తు పెంచుతున్నా, ప్రాజెక్టులు కడుతున్నా ఏనాడూ పట్టించుకోలేదు’.

దివంగత నేత వైయస్సార్‌ హయాంలో…
‘ఆ తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు పనులు పరుగెత్తించారు. ఆయన హయాంలోనే పోలవరం కుడి మెయిన్‌ కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు’. ‘2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక ఆయన సేకరించిన భూమి కేవలం 1700 ఎకరాలు మాత్రమే. అంటే కేవలం 14 శాతం. అంటే అంతకు ముందు 86 శాతం భూమి సేకరించి పనులు పరుగెత్తిస్తే (నిజానికి ఆనాడు కూడా కోర్టులో కేసులు వేయించి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు), ఈ పెద్దమనిషి కేవలం కుడి మెయిన్‌ కాలువలో 14 శాతం మాత్రమే చేశారు’. అదే విధంగా ప్రాజెక్టు ఎడమ మెయిన్‌ కాలువ కోసం దివంగత నేత హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగగా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. కాబట్టి ఒక ప్రాజెక్టు కోసం ఎవరు చిత్తశుద్దితో పని చేశారన్నది తెలుసుకోవాలి’.

అనుమతులన్నీ దివంగత నేత హయాంలోనే..:
‘దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి గారు తన హయాంలో పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చారు’. ‘సైట్‌ క్లియరెన్స్‌ ఫ్రమ్‌ ఎంఓఈఎఫ్‌ సెప్టెంబరు 2005. ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్సు అక్టోబరు 2005. వైల్డ్‌ లైఫ్‌ క్లియరెన్సు ఫ్రమ్‌ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ జూలై 2006. ఆర్‌ అండ్‌ ఆర్‌ క్లియరెన్సు ఫ్రమ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ ఎఫెయిర్స్‌ మే 2007. సుప్రీంకోర్టు ఆర్డర్‌. పర్మిషన్‌ ఫర్‌ డైవర్షన్‌ ఆఫ్‌ ఆర్‌ఎఫ్‌ ల్యాండ్‌ పర్‌టెయినింగ్‌ ఆఫ్‌ పాపికొండ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ సెప్టెంబరు 2008. ఫారెస్టు క్లియరెన్స్‌ స్టేజ్‌–1 ఫ్రమ్‌ ఎంఓఈఎఫ్‌ డిసెంబరు 2008. టీఏసీ క్లియరెన్స్‌ ఫ్రమ్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ జనవరి 2009. ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఫ్రమ్‌ ప్లానింగ్‌ కమిషన్‌ ఫిబ్రవరీ 2009. ఈఏసీ క్లియరెన్సు మార్చి 2009. ఫారెస్టు క్లియరెన్సు స్టేజ్‌–2 జూలై 2010. అంటే ఇవి రావడానికి మొత్తం 4 ఏళ్లు పట్టింది. 2005లో దరఖాస్తు చేస్తే, తొలి ఫారెస్టు క్లియరెన్సు డిసెంబరు 2008లో వస్తే, సెకండ్‌ స్టేజ్‌ క్లియరెన్సు జూలై 2010లో వచ్చింది. ఇంకా రావాల్సి క్లియరెన్సు టీఏసీ ఫర్‌ ఆర్‌సీఈ–1 ఫర్‌ 2010–2011 పైజెస్‌. అది జనవరి 2011లో వచ్చింది’. ‘అలా రావాల్సిన అన్ని క్లియరెన్సులు ఆ దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలోనే వచ్చాయి. ఆయన చాల చిత్తశుద్ధితో భూసేకరణతో పాటు, పనులు కూడా చేశారు. ఆయన హయాంలో టోటల్‌గా ఎడమ కాలువ అయితే ఏమీ, కుడి కాలువ అయితే ఏమీ ఆ పురోగతి’

ఎవరో పనులు చేపడితే..:
‘ఈరోజు పట్టిసీమ అని చెప్పి, ఎవరో పనులు చేసి పెడితే, ఆ క్రెడిట్‌ తీసుకునే కార్యక్రమంలో ఎంత గొప్పగా మన చంద్రబాబు నాయుడు ఉంటాడు అంటే దానికి నిదర్శనం ఈ పట్టిసీమ. ఇదే పట్టిసీమలో ఆ కాలువ పనులు కూడా కాకపోయి ఉంటే, ఆయన పట్టిసీమ నీళ్లు ఎలా తరలించే వాడు. ఎక్కడికి తీసుకుపోగలిగేవాడు’.

2014కు ముందు పోలవరం పనులు:
‘2014 జూన్‌కు ముందు పోలవరం ప్రాజెక్టులో పూరై్తన పనులు చూస్తే.. వాటిలో ప్రధానంగా భూసేకరణ. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు. అవే దాదాపు 40 శాతం పనులు. ఆతర్వాత హెడ్‌ వర్క్స్, ఎడమ, కుడి కాలువలు, పవర్‌హౌజ్‌ ఉంటాయి’. ‘2014 జూన్‌ వరకు జరిగిన హెడ్‌ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చూస్తే 20.61 శాతం పనులు పూర్తయ్యాయి. ఓవరాల్‌గా భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కూడా కలుపుకుని మొత్తం ప్రాజెక్టు పనులను చూస్తే 9.29 శాతం పూర్తయ్యాయి. ఆ తర్వాత 2014 జూన్‌లో చంద్రబాబునాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక, ఆయన హయాంలో అయిన పనులు చూస్తే.. హెడ్‌ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చూస్తే 39.53 శాతం పనులు, ప్రాజెక్టులో ఓవరాల్‌గా చూస్తే అయిన పనులు 20 శాతం మాత్రమే, అది కూడా రూ.55 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం చూస్తే’.

అయినా అసత్య ప్రచారం:
‘ఆ తర్వాత మేము వచ్చే నాటికి ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్‌గా 29.80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. హెడ్‌ వర్క్స్, ఎడమ, కుడి కాలువలకు సంబంధించి, అంతకు ముందు జరిగిన పనులు కూడా కలుపుకుని చూస్తే 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కానీ నోరు తెరిస్తే ప్రాజెక్టులో 70 శాతం పూర్తి చేశామని పదే పదే చెబుతున్నారు. అయితే వాస్తవాలు ఇలా ఉన్నాయి’.

గర్వంగా చెబుతున్నాను:
‘ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులన్నీ మేము పూర్తి చేస్తున్నాం. ఆ దివంగత నేత కొడుకు పూర్తి చేస్తున్నాడని గర్వంగా చెబుతున్నాము. ఇక ప్రాజెక్టుల్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తూ ప్రధాని స్వయంగా చెప్పారు. పోలవరం పనులను చంద్రబాబు ఒక ఏటీఎంగా చేసుకున్నారని ప్రధాని అన్నారు’.

రివర్స్‌ టెండరింగ్‌–ఆదా:
‘ఇదే పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ చేస్తే అక్షరాలా రూ.1343 కోట్లు ఆదా అయ్యాయి. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలుస్తుంది. ఇవన్నీ క్లియర్‌గా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి యాపిల్‌ టు యాపిల్‌ పద్ధతిలో తొలుత రివర్స్‌ టెండర్లు పిలిస్తే రూ.1142 కోట్లు ఆదా అయ్యాయి. మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో ఆ తర్వాత జరిగిన టెండర్లలో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా మొత్తం రూ.1343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి’.

పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగింది?, ఎక్కడ తప్పు జరిగింది?:
‘2016 సెప్టెంబరు 7న స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చారు. అరుణ్‌జైట్లీ ఆ రాత్రి మీటింగ్‌ పెట్టి చెప్పడం, ఆయన పక్కనే టీడీపీ మంత్రులు ఉండడం, అదే రాత్రి చంద్రబాబు కూడా మీటింగ్‌ పెట్టి, ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం అన్నీ మనకు గుర్తున్నాయి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, స్పెషల్‌ ప్యాకేజీ అంటూ డ్రామాలు చేశారు. దాన్నీ చూశాము. ఆ తర్వాత మర్నాడు సెప్టెంబరు 8న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.. అంటూ ఆ ప్రెస్‌ నోట్‌ను సభలో ప్రదర్శించి చూపిన సీఎం అందులో ముఖ్యాంశాలను చదివి వినిపించారు. ప్రాజెక్టులో ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి కొడుకును. ఆయన ఊహించినట్లు కడతాం. 2022 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకువస్తాం. ఈ ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయడానికి ఎంత కావాలన్నది ఇంతకు ముందే చెప్పాను. ఈ ప్రాజెక్టు కచ్చితంగా పూర్తవుతుంది’.

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు:
‘మా నియోజకవర్గంలో చిత్రావతి ప్రాజెక్టు. దాని సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ ఏనాడూ 3 టీఎంసీలకు మించి నింపలేదు. కారణం రూ.240 కోట్లు. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులు ఇవ్వలేదు. అదే విధంగా పులిచింతల, కండలేరు, గండికోట, వెలిగొండ కూడా. ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకపోతే నీళ్లు ఎలా నింపుతాం?. మేము అధికారంలోకి రాగానే చిత్రావతి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చాం. 10 టీఎంసీలు నింపుతున్నాం. ‘అదే విధంగా గండికోట ప్రాజెక్టు. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం దాదాపు రూ.600 కోట్లు ఇచ్చాం. ఈరోజు అందులో 19 టీఎంసీలు నిల్వ. దాన్ని ఇంకా పెంచవచ్చు. నిర్వాసితులు కాస్త సమయం కోరుతున్నారు. కండలేరు ప్రాజెక్టులో రూ.50 కోట్లు ఇవ్వక, 10 టీఎంసీలు తక్కువగా నిల్వ చేశారు.

యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు ..
‘పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళం కూడా తగ్గదు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. పోలవరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 194 టీఎంసీలు. పోలవరం ప్రాజెక్టులో 41.15
మీటర్ల వరకు నీరు నిల్వ చేయాలంటే భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.3,383 కోట్లు కావాలి. ఆ స్థాయిలో 120 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత 44 మీటర్ల ఎత్తు వరకు పోవడానికి మరో రూ.2 వేల కోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం ఖర్చు చేస్తే 158.39 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 45 మీటర్లకు పెంచితే మరో రూ.4500 ఖర్చు చేయాలి. అలా పెంచితే 180 టీఎంసీల వరకు నీరు నిల్వ చేయొచ్చు. దాని తర్వాత ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 194 టీఎంసీల నిల్వ చేయాలంటే రూ.13,699 కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం భూసేకరణకు మరో రూ.3 వేల కోట్లు కావాలి. అంటే రూ.16 వేల కోట్లు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు ఆపొద్దని  అంతలోతుగా వెళ్తున్నాం’.

సీడబ్ల్యూసీ ప్రొటోకాల్‌:
‘ఇక్కడ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రొటోకాల్‌ ఉంటుంది. ప్రాజెక్టు కట్టగానే పూర్తి స్థాయిలో నీరు నింపరు. ఆ మార్గదర్శకాలు ఒకసారి చూస్తే.. ‘డ్యామ్‌ కట్టిన తర్వాత మొదటి ఏడాది 33 శాతం వరకు, రెండో ఏడాది 50 శాతం
వరకు, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీరు నింపాలి. ఇదీ సీడబ్ల్యూసీ ప్రొటోకాల్‌. ఏ డ్యామ్‌కు అయినా అవే నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ మనం 41.5 మీటర్ల వరకు నిల్వకు వెళ్తాం. అంటే దాదాపు 120 టీఎంసీలు నిల్వ చేస్తాం’.

తగ్గించే ప్రసక్తి లేదు:
‘పోలవరం డ్యామ్, రిజర్వాయర్‌ కెపాసిటీ ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించడం లేదు. అదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాము. ఎందుకంటే రేపు ఎల్లో మీడియా. చంద్రబాబు డ్రామాలు. ఎల్లో మీడియా కాంబినేషన్‌. వారు ఏమైనా చెప్పగలుగుతారు. నిందిస్తారు. అందుకే అంత వివరంగా చెప్పాము. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు ఏమిటి? గతంలో ఏం జరిగింది? మనం ఏ విధంగా పనులు చేస్తున్నాము? అన్న మూడు విషయాలు చెప్పాను’.

వైయస్సార్‌ విగ్రహం:
‘మన ఎమ్మెల్యేలు కోరినట్లు తీర్మానం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు. అక్కడ 100 అడుగుల వైయస్సార్‌ విగ్రహం ప్రతిష్టిస్తాం’.

గతంలో వృథా వ్యయం:
‘ఇదే పోలవరం ప్రాజెక్టులో గతంలో ఏ విధంగా వృధా వ్యయం చేశారో చూద్దాం.. బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. అందులో భోజనం బిల్లులు ఏకంగా రూ.14 కోట్లు. అంత జనం వచ్చిందీ లేదు. చూసిందీ లేదు. అయినా అడ్డగోలుగా లెక్కలు రాసి దోచుకున్నారు. అసలు ప్రాజెక్టు పనులు కూడా కాలేదు’.

పనులు జరగకపోయినా!:
‘డయాఫ్రమ్‌ వాల్‌. అంటే కేవలం ఫౌండేషన్‌ పనులు. అవి కూడా కాకపోయినా ఏకంగా మూడు సార్లు హడావిడి. గేట్లు పెడుతున్నామని మరోసారి హడావిడి. అలా హంగామా చేసి ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు చేశాడు చంద్రబాబు. ప్రజలను తీసుకుపోయి ఏం చేశారో చూద్దాం.. అంటూ నాడు చంద్రబాబును పొగుడుతూ మహిళలు పాడిన పాటలు చూపారు. వీడియో ప్రదర్శించి చూపారు. ఆ విధంగా తాము ఒక్క రూపాయి కూడా వృథా చేయబోమంటూ స్పష్టం చేసిన సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు. అనంత‌రం స్పీకర్‌ సభను గురువారం ఉదయానికి వాయిదా వేశారు.

Just In...