పాడిపరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయం పెరగాలి …
* ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
* తొలిదశలో చిత్తూరు, కడప ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ
అమరావతి, సెల్ఐటి న్యూస్: రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన రైతులకు లీటర్‌కు అదనంగా ఐదు రూపాయలైన ఆదాయం పెరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్ట్ తొలిదశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, డెయిరీ,మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ డాక్టర్ ఆర్.ఎస్.సోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజిమెంట్ ఆనంద్ (ఐఆర్ఎంఏ-ఇర్మా) డైరెక్టర్ ప్రొఫెసర్ సశ్వత ఎన్.బిస్వాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
పాడి ఉన్న ఇంట – సిరులు
పాదయాత్రలో నేను అన్నమాటల ఇవాళ గుర్తుకు తెచ్చుకుంటే సంతోషంగా ఉంది. పాడి ఉన్న ఇంట.. సిరులు దొర్లునట అని ఆరోజు అన్నాను. ఒట్టి వ్యవసాయంతోనే బతకాలంటే ఆదాయం సరిపోదు, ఆదాయాలు పెరగాలంటే పాడి సహకారం అవసరం, ఆసరా, చేయూత పథకాలు అందుకే పెట్టాం. అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు వారికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి డబ్బులు సద్వినియోగం అయ్యేట్టుగా.. వాళ్లందరూ కూడా ఇలాంటి వ్యవస్థలోకి వచ్చి మేలు జరగాలని తాపత్రయ పడ్డాం.
ఆ కలకు సాకారమే.. ఇవ్వాళ్టి ప్రాజెక్టు..
దేవుడు ఆశీర్వదించి ఈ భాగస్వామ్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఏపీ – అమూల్ ప్రాజెక్టు గురించి చెప్పే ముందు ఒక్క విషయం పాడి రైతులకు చెప్పాలి. మార్కెట్లో ఇప్పటివరకూ అమ్ముకుంటున్న ధరకంటే లీటరు కనీసం రూ.4–5 రూపాయలు ఎక్కువగా రావాలన్న ఆరాటం నుంచి ఈ ఆలోచన పుట్టింది. నాకు బాగా గుర్తుంది నా పాదయాత్రలో లీటర్ వాటర్ బాటిల్‌ను రైతులు తీసుకు వచ్చారు. ఒక లీటరు వాటరు ధర రూ.21 ఉంది, ఈ రోజు పాలధరకూడా అంతే ఉందని నా దగ్గరకు తీసుకు వచ్చారు. ఇలా ఉంటే ఏ రకంగా గిట్టుబాటు అవుతుందని ఆరోజు వారన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ ఆలోచనల నుంచి మనం అధికారంలోకి దేవుడి దయతో వచ్చిన తర్వాత మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచాలి, సహకార రంగాన్ని బలపరచాలి. ఎప్పుడైతే కోపరేటివర్ సెక్టార్ బలపడుతుందో అప్పుడే మార్కెట్లో కాంపిటేషన్ క్రియేట్ అవుతుంది. మనం రూ.4లు ఎక్కువగా ఎప్పుడైతే సహకార రంగం నుంచి ఇస్తామో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా రేట్లు పెరుగుతాయి, దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఆదాయం పెరిగి మేలు జరుగుతుంది. అందుకనే ఈ మాటను మేనిఫెస్టోలో కూడా పెట్టాం.
పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు..
రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు డైరీల కన్నా, అమూల్రావడంతో ప్రభుత్వం, అమూల్‌తో కలవడం వల్ల, దాదాపు రూ.5 నుంచి రూ.7ల వరకూ లీటరు పాల ధర పెరుగుతుంది. మనం రూ.5–7లు పెంచితే ప్రయివేటు డైరీలు కూడా కచ్చితంగా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మొత్తం వ్యవస్ధలోకే రూ 5–7 పెరుగుతాయి. అమూల్‌తో మనం సౌజన్యం వల్ల జరిగే మరో గొప్ప మేలు ఏంటంటే.. ఎక్కువ రేటుకు పాలను కొనుగోలు చేయడమే కాకుండా, అమూల్ ఇక్కడ వచ్చే లాభాలన్నింటినీ కూడా ఏడాదికి రెండు విడతల్లో బోనస్‌గా అక్క చెల్లెమ్మలకు చెల్లిస్తారు. అమూల్ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్ అన్నది ఎవరూ లేరు… పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు. అంటే రావడం, రావడమే ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత లాభాలను కూడా బోనస్‌గా సంవత్సరానికి రెండు సార్లు చొప్పున వెనక్కి కూడా ఇస్తారు. అమూల్, రాష్ట్ర ప్రభుత్వం కలయిక వల్ల జరిగే గొప్ప మేలు ఇది.
అమూల్- సహకార ఉద్యమం..
అమూల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమూల్ భారతదేశంలోనే కాదు ప్రపంచంతో పోటీపడే కంపెనీ. ఈ మధ్య కాలంలో ఐఎఫ్సిఎన్ (ఇంటర్నేషనల్ ఫార్మ్ కంపేరజన్ నెట్వర్క్ ) రిపోర్టు ఇచ్చింది, అందులో చూస్తే అమూల్‌కి 8 వ స్ధానం ఇచ్చింది. అంటే ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉండి ప్రపంచంతో పోటీ పడే స్ధాయిలో ఉంది. అమూల్ అన్నది సహకార ఉద్యమం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది జులై 21న మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అది సహకార రంగంలో డెయిరీల పునరుద్ధరణ, వాటి బలోపేతానికి ఒప్పందం దోహదపడుతుంది.
9899 గ్రామాల్లో బీఎంసీలు…
రాష్ట్ర వ్యాప్తంగా 9899 గ్రామాల్లో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రూ.3వేల కోట్ల రూపాయలను దీనికోసం పెడుతున్నాం. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఇవి దాదాపు రెండువేల లీటర్ల పాలను స్టోర్ చేయగలిగిన సామర్ధ్యంతో ఉంటాయి. అక్కచెల్లెమ్మలకు జీవితకాల ఆదాయం రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రోజు గురించి కాదు. ఇవ్వాళ్టి నుంచి మరో శతాబ్దం కాలంపాటు.. మన వాళ్లకు శాశ్వతంగా ఉండాలి, మేలు జరగాలన్న ఆలోచనతో, దృక్పథంతో వీటిని మొదలుపెడుతున్నాం.
తొలివిడత చిత్తూరు, వైయస్సార్ కడప, ప్రకాశం జిల్లాలు …
ఈ రోజు చిత్తూరు, వైయస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ 400 గ్రామాల్లో పాలసేకరణ మొదలుపెడుతున్నాం. త్వరలోనే 9899 గ్రామాలకు విస్తరిస్తుంది. 13 జిల్లాల్లో ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ కార్యక్రమం విస్తరిస్తాం. పాలసేకరణ తర్వాత కేవలం 10 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎక్కడా కూడా మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు, ఎక్కడా కమిషన్లు ఉండవు. జమ చేయడమే కాకుండా రూ.5 నుంచి రూ.6 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ పెరిగిన సొమ్ము వాళ్ల అకౌంట్లోకే వస్తుంది.
అక్క చెల్లమ్మలకు ఆసరా, చేయూత…
అక్కచెల్లెమ్మలు వారి కాళ్లమీద వారు నిలబడాలన్న ఉద్దేశంతో ఆసరా, చేయూత పొందిన వారికి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తుందని చెప్పాం. అంతేకాకుండా ఐటీసీ, అలానా గ్రూప్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం. మహిలకు ఇస్తున్న రూ.75వేల రూపాయలు ఇదే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఆ ఉత్పత్తుల నుంచి ప్రతిరోజూ, ప్రతినెలా మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడం జరిగింది. ఇందులో భాగంగానే 4.69 లక్షల మంది మహిళలు పాడి పెట్టుకుంటాము మాకు ఆవులు, గేదెలు ఇవ్వండని అడిగారు. ఒకేసారి అన్ని యూనిట్లు దొరకవు కాబట్టి (ఒక యూనిట్ అంటే ఒక గేదె లేదా ఆవు)… దశల వారీగా ఇస్తాం. ఇవాళ 7వేల యూనిట్లు పంపిణీ జరుగుతుంది.
దశల వారీగా పంపిణీ …
ఇది కాక వచ్చే ఏడాది ఫిబ్రవరి సమయానికల్లా మరో 1లక్ష యూనిట్లు ఆవులు, గేదెలు ఇస్తాం. మరలా అదే సంవత్సరం ఆగస్టులో సీజన్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకూ మరో 3.69లక్షలకుపైగా యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కరూపాయికూడా అక్కచెల్లెమ్మలు పెట్టాల్సిన అవసరంలేదు. చేయూత కింద డబ్బులను ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి, పెట్టుబడి ఉచితం అని అనుకోవచ్చు. ఈ పశువులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు, లబ్దిదారులు కూడా స్వయంగా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం సలహాలు,సూచనలు ఇస్తుంది. మేలు జాతి పాడి పశువులను కొనుక్కోవడం వల్ల వారికొచ్చే లాభాలను కూడా వివరించడం జరిగింది. వాతావరణ పరిస్థితులను తట్టుకుని బతికే జాతులు పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా తదితర రాష్ట్రాలనుంచి కూడా అధిక పాలదిగుబడినిచ్చే ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అమూల్‌తో
కలయిక వల్ల రాష్ట్రంలో ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలి.
డిసెంబరు 10న గొర్రెలు, మేకలు పంపిణీ …
డిసెంబరు 10వ తేదీన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఒక్కో యూనిట్లో 15 గొర్రెలు, మేకలు ఉంటాయి. దాదాపుగా 77వేల రిటైల్ షాపులు హిందుస్ధాన్ లీవర్, ఐటీసీ సంస్ధల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలతో చేయూత ద్వారా ఏర్పాటు చేయించడం జరుగుతోంది. మనం ఇచ్చే చేయూత సొమ్ముతోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అడిగిన వెంటనే మనతో పాటు ప్రయాణం చేయడానికి ఉత్సాహం చూపించిన అమూల్ సంస్ధకు మనస్ఫూర్తిగా ఆ సంస్ధ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.