Published On: Mon, Jan 11th, 2021

డ్రైవింగ్ సీటును పవిత్రమైన స్థానంగా భావించాలి

* రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ(కృష్ణాజిల్లా), సెల్ఐటి న్యూస్‌: డ్రైవింగ్ సీటులో కూర్చొనే డ్రైవర్లు ఆ స్థానాన్ని పవిత్రమైన స్థానంగా భావించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సూచించారు. సోమవారం గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని బెస్ట్ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన డ్రైవర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు . డ్రైవింగ్ పై అనేక మెళకువలను తెలియజేశారు. డ్రైవింగ్ స్కూల్ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కాళ్ళు,  చేతులతో కన్నా బ్రెయిన్‌తో డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నారు. డ్రైవర్లు సురక్షితంగా డ్రైవింగ్ చేస్తేనే వారి కుటుంబాలు బాగుంటాయన్నారు. కొద్దిపాటి అజాగ్రత్త, నిర్లక్ష్యంగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే మనతో పాటు రోడ్డుపై వెళ్ళే పాద‌చారుల‌తో పాటు ప్రయాణీకులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ అనేది ఒక వృత్తి అని, దీన్ని చేసేవారికి అది ఒక జీవితమన్నారు. డ్రైవింగ్ సీటులో కూర్చొన్న మొదటి నిమిషం నుండి గమ్యస్థానం చేరుకునే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు . కొద్ది సమయం తర్వాత అలసిపోవడం, నిద్రలోకి జారుకోవడం వంటివి చేయరాదన్నారు. డ్రైవరకు ఉండాల్సింది ఓర్పు అలా లేనప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపి విశ్రాంతి తీసుకోవాలన్నారు. డ్రైవింగ్ చేసేటపుడు నిద్ర వస్తే దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదన్నారు . చర్చి, గుడి, మసీదుకు వెళ్ళినపుడు ఎంత పవిత్రంగా ఉంటామో డ్రైవింగ్ సీటులో కూర్చొన్నపుడు కూడా అంతే పవిత్రంగా ఉండాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా మనతో పాటు ప్రమాదానికి గురైన వారు కూడా ఉండరన్నారు . డ్రైవింగ్ సీటులో కూర్చొన్నపుడు అపస్మారక స్థితికి చేరుకునే పరిస్థితులు డకూడదన్నారు. మద్యం తీసుకుంటే డ్రైవింగ్ చేసి అలసిపోయిన స్థితిలో నిద్ర వస్తుందన్నారు. బ్రెయిన్ కూడా పనిచేసే పరిస్థితి ఉండదన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలన్నారు. డ్రైవర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. ఇప్పుడున్న బస్సుల కండిషన్ 30 ఏళ్ళ కిందట లారీలు, బస్సుల కండిషన్‌కు సంబంధం లేదన్నారు. ప్ర‌స్తుతం అధునాతనమైన వాహనాలను ఇప్పటి డ్రైవర్లు తోలుతున్నారన్నారు. డ్రైవింగ్ స్కూల్స్ లో అంబాసిడర్ కారు , 370 ఇంజన్లు, ఆయిల్ బ్రేక్ లు కల్గిన వాహనాలు ఉండేవన్నారు. బయట రాష్ట్రాలకు వెళ్ళే డ్రైవర్లు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు. అనంతరం మంత్రి కొడాలి నానిని దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాల్టి , వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, మోటారు వెహికల్ ఇన్స్‌స్పెక‌ట్ల‌రు మురళీకృష్ణ , స్వామినాయుడు, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ నల్లాని వెంకట్రావు, ఇన్‌స్పెక్ట‌ర్లు వెంకటేశ్వరరెడ్డి , శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Just In...