Published On: Tue, Jan 12th, 2021

హైకోర్టు తీర్పు ప‌ట్ల ఏపి జేఏసీ అమ‌రావ‌తి నేత‌లు హ‌ర్షం

* ధర్మం వైపు న్యాయం గెలిచింద‌న్న నేత‌లు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప‌ట్ల ఏపి జేఏసీ అమరావతి నేత‌లు హర్షం వ్యక్తం చేశారు. ధర్మం వైపు న్యాయం గెలిచింద‌ని వారు వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు‌లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నిర్వహణపై తీసుకున్ననిర్ణయం వల్ల ఉద్యోగులు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని ఉద్యోగ సంఘాలు గత నాలుగు రోజులుగా చేసిన ఆందోళన నేపథ్యంలో సోమ‌వారం హైకోర్టు తీర్పు ఊరట కల్గించింద‌న్నారు. ధర్మం పక్కనే న్యాయం ఉంటుందని ఈ తీర్పు ఋజువు చేసింద‌న్నారు. కేవలం లక్షలాది మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత కోర్టులు తీసుకున్నందుకు కోర్టు తీర్పులపై అందరికి గౌరవం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ తీర్పుపై బెంచ్‌కి వెళ్తారని తెలుస్తుంద‌ని, పంతాలకు పోయి ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడొద్ద‌ని ఏపి జేఏసీ అమరావతి పక్షాన విజ్ఞ‌ప్తి చేశారు. రాజకీయ పార్టీల యొక్క స్వలాభం కోసం ఉద్యోగుల, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమని పేర్కొన్నారు. కోర్టు తీర్పును ఎస్ఈసీ గౌరవించి, వేరే ఫోరాలపై అప్పీల్‌కు వెళ్లకుండా, ఉద్యోగులు వారి కుటుంబ సబ్యుల ప్రాణాలు కాపాడాలని, అలాగే కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. అతి త్వరలో గ‌వ‌ర్న‌ర్‌ను ఏపి జేఏసీ అమరావతి పక్షాన వివిధ ఉద్యోగ సంఘాలు కలిసి ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాణ పట్ల త‌మ‌కు ఉన్నభయాందోళన, పొంచి ఉన్న ప్రమాదాలు అన్నీ విషయాలు సవివరంగా విన్నవిస్తామని తెలిపారు. ఈ విష‌య‌మై సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ గ‌వ‌ర్న‌రుపేట‌లోని రెవెన్యూ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప‌లువురు జేఏసీ నేత‌లు మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఉద్యోగులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ఏపి మున్సిప‌ల్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈశ్వ‌ర్‌లు మాట్లాడుతూ ఉద్యోగులను విమర్శించే అర్హత టీడీపీ నేత అశోక్‌బాబుకు లేద‌న్నారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు కరోనాను ఆపలేవని ఆయ‌న మండిపడ్డారు. కరోనాతో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వ్యాక్సినేషన్  తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. తమ విజ్ఞప్తిని ఎస్‌ఈసీ పునరాలోచించాలని ఆయన కోరారు. విలేక‌రుల స‌మావేశంలో ప‌లువురు ఉద్యోగ సంఘాల నేత‌లు పాల్గొన్నారు. 

Just In...