Published On: Wed, Jan 13th, 2021

హ‌మ్మ‌య్య‌.. వ్యాక్సిన్ వ‌చ్చేసింది …

* తొలివిడ‌త‌గా ఏపీకి చేరుకున్న 4.77 లక్షల డోస్‌లు

* 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

* ప్ర‌క‌టించిన కృష్ణా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు కరోవా వైరస్ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా రాష్ట్రానికి 4,77 లక్షల కోవిషీల్డ్ టీకా డోస్‌లు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్‌ .యండి.ఇంతియాజ్ తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం వీటిని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్‌ శ్రీహరి, జెసి యల్.శివశంకర్ ఆధ్వర్యంలో స్వీకరించారు. వీటిని ఎయిర్‌పోర్ట్ కార్గో నుంచి ప్రత్యేక వాహనంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించే ఏర్పాట్లను జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టరు ఏ.శ్రీహరి, జా యింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్.శివశంకర్‌ స్వయంగా పర్యవేక్షించారు. విమానాశ్రయానికి కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు చేరుకోగానే పోలీసుల భద్రత మధ్య 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వాటిని గన్నవరంలో శీతలీకరణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్ మాట్లాడుతూ పూణె నుంచి ప్రత్యేక విమానంలో 4.75 లక్షల డోస్‌ల కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ అందిందన్నారు. గన్నవరంలో సుమారు 35 లక్షల డోల స్టోరేజ్ కెపాసిటీ గల గోడౌన్‌లను సిద్ధం చేశామన్నారు సాయంత్రం స‌మ‌యంలో 2.70 లక్షల కోవ్యాక్సిన్ కూడా చేరనుందన్నారు. వీటిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు న‌డుమ 19 వాహనాలు ద్వారా పంపడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య భద్రపర‌చి రవాణా చేయడం జరుగుతుందన్నారు. కృష్ణాజిల్లాలో ఈ నెల 16వ తేదీన తొలిదశలో 30 కేంద్రాల ద్వారా సుమారు 3 వేలమంది హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ద్వారా ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో తొలివిడతలో హెల్త్ కేర్ వర్కర్స్ కు యాక్సినేషన్ వేయడం జరుగుతుందని ఇప్పటికే 36500 మంది కోవిడ్ యాప్ ద్వారా వారి పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. రెండో విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్, పోలీస్, రెవెన్యూ పంచాయతీరాజ్, తదితర కోవిడ్ వారియర్స్ కు టీకాలు వేస్తామని, జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేలకు పైబడి ఆకేటగిరీలో ఉండవచ్చన్నారు. వీరిలో ఇప్పటికీ సుమారు 18 వేల మంది వారి పేర్లు నమోదు చేసుకున్నారన్నారు మూడవ విడతలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, కోవిడ్ బాధితులకు టీకాలు అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 లక్షల జనాభాకు టీకాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా టీకాను వేసుకోవాలని ఇందుకోసం స్నేహితులకు, బంధువులకు, తోటివారికి అవగాహన కలిగించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కలెక్టరు తెలిపారు.

Just In...