Published On: Mon, Feb 8th, 2021

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం

* ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి

* మార్చి నుంచి అందరికీ అందుబాటులోకి వ్యాక్సిన్

* గిరిపురంలో కుమార్తెతో కలసి వ్యాక్సిన్ వేయించుకున్న కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అన్నారు. నగరంలోని గిరిపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమవారం కుమార్తె హిబ ఫర్హిన్‌తో కలసి కలెక్టర్ ఇంతియాజ్ కోవ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్‌పై ఏవైనా అపోహలు ఉంటే విడనాడాలన్నారు.
వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని ఆయన స్పష్టం చేశారు. తొలివిడతలో వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ తదితర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర సిబ్బందికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు. ఇంతవరకు 1,010 సెషన్స్‌లో సుమారు 23 వేల మందికి వ్యాక్సిన్ అందించారన్నారు. రానున్న మార్చి నాటికి మిగతా ప్రజానికానికి వ్యాక్సిన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా రెండవ విడత కార్యక్రమాన్ని ఈ నెల 16 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కోవిడ్ కేసుల నియంత్రణలో మన జిల్లా ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని, మరణాల శాతం కూడా బాగా తగ్గాయన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు. గర్భిణీలు, పిల్లలు, బాలింతలు అలర్జీ ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోకూడదన్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.సుహాసిని, డాక్టర్లు మోతీబాబు, ఎస్.రవళి తదితరులు పాల్గొన్నారు.

 

Just In...