Published On: Thu, Feb 18th, 2021

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌…

* అరెస్టును ఖండించిన నారా లోకేష్‌‌

ఏలూరు క్రైం, సెల్ఐటి న్యూస్‌: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం పెదవేగి మండలం బి.సింగవరంలో చింతమనేని ఎన్నికల ప్రచారం చేశారు. అయితే చింతమనేని వెళ్లిపోయిన తర్వాత సింగవరంలో ఇరువర్గాల ఘర్షణకు దిగాయి. ఈ కారణంతో చింతమనేనిని అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుతో సంబంధం లేకున్నా చింతమనేనిని అరెస్ట్‌ చేశారని మండిపడుతున్నారు. మరోవైపు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య నువ్వా నేనా అన్నట్లు సమరం సాగింది. వైసీపీ రెబల్స్‌ ఆ పార్టీకి కంటిలో నలుసుగా మారాయి. ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుల్లో రాజకీయం రంజుగా సాగింది. కుక్కునూరు మండలంలో తెలుగుదేశం హవా నడిచింది.   చింతలపూడి నియోజకవర్గంలోనూ సముజ్జీలుగా వైసీపీ, టీడీపీ ప్రధాన పక్షాల మద్దతుదారులు ఢీకొన్నారు. మ‌రోవైపు చింతమనేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్‌ ప్రకటించారు. తక్షణం చింతమనేని ప్రభాకర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు సీఎం జగన్ పిరికిపంద చర్యకు నిదర్శనమన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేష్‌ మండిపడ్డారు.

Just In...