Published On: Thu, Feb 18th, 2021

యుద్ధవీరుడికి సీఎం జగన్ ఘన సన్మానం

తిరుప‌తి, సెల్ఐటి న్యూస్‌: భారత్‌ – పాక్ న‌డుమ 1971లో జ‌రిగిన యుద్ధంలో విశేష సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధవీరుడు రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌నంగా సత్కరించారు. ప్రస్తుతం వేణుగోపాల్ వయసు 95 ఏళ్లు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడంతో సీఎం జగన్ గురువారం తిరుప‌తిలోని నేరుగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. మరికాసేపట్లో పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని మాజీ సైనికులను సన్మానించారు. భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వప్నిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వెలిగించిన విజయ జ్వాల (విక్టరీ ఫ్లేమ్) బుధవారం తిరుపతి చేరుకుంది. 20వ తేదీ వరకు తిరుపతిలోనే ఈ జ్వాలకు ఆతిథ్యం ఇస్తున్నారు. తిరుపతికి పర్యటనలో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, జంగాలపల్లె శ్రీనివాసులు, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదన రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. స్వర్నిమ్ విజయ్ వర్ష్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతం స‌వాంగ్‌, ప‌లువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

Just In...