జలగణన శాఖ డైరెక్టర్‌గా అంగత వరప్రసాదరావు
* బాధ్యతల స్వీకరణ
విజయవాడ, సెల్ఐటి న్యూస్: భూగర్భ జలం మరియు జలగణన శాఖలో డైరెక్టర్‌గా అంగత వరప్రసాదరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వరప్రసాదరావుకు పదోన్నతి కల్పించి అదే శాఖకు డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1985లో అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్టుగా ఈ శాఖలో జాయిన్ అయిన వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో వివిధ హోదాలలో పనిచేశారు. నెల్లూరు, కృష్ణాజిల్లాలో డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో అనేకమంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు ‘నీటి పొదుపు మరియు యాజమాన్యం’ పట్ల అవగాహన కల్పించారు. కృష్ణాజిల్లాలో ‘జలంబడి’ పేరిట లక్షలాది మంది విద్యార్థులకు నీటి పొదుపు పట్ల అవగాహన కల్పించి, నీటి సంరక్షణా ప్రతిజ్ఞ చేయించినందుకు ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్సలో వరప్రసాదరావుకు స్థానం కల్పించారు. అంతకు ముందు 2013వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి ‘జలమిత్ర’ పురస్కారం, 2019లో ‘ఉగాది పురస్కారం’ అందించింది. వీరు జలగీతిక, జలసూక్తులు, వేమన వాక్కులు వంటి పుస్తకాలను రచించారు. భూగర్భ జలం మరియు జలగణన శాఖ 1971 ఫిబ్రవరి 18న స్థాపించబడి నేటికి 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమౌతోంది. గత 50 సంవత్సరాలుగా ఈ శాఖ భూగర్భజల శాస్త్రానికి మరియు సమాజానికి ఎంతో సేవలందించింది. 50 సంవత్సరాల చరిత్ర గల ఈ శాఖలో గత 35 సంవత్సరాలుగా అంగత వరప్రసాదరావు వివిధ జిల్లాల్లో తన సేవలు అందించారు. వీరి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా మార్చి నెలలో “భూగర్భజల రంగంలో అవకాశాలు మరియు సవాళ్లు” అనే అంశంపై నేషనల్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌నకు వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు.