Published On: Mon, Feb 22nd, 2021

మాతృభాష మ‌నిషి ఎదుగుద‌ల‌కు ‌తొలిమెట్టు

* డీఎస్ఎం హైస్కూల్ ప్ర‌ధానోపాధ్యాయులు ఎం.కోట‌య్య‌

* పాఠ‌శాల‌లో ఘ‌నంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు

విధ్యాధ‌ర‌పురం(విజ‌య‌వాడ‌), సెల్ఐటి న్యూస్‌: మాతృభాష మనిషి ఎదుగుదలకు మొదటి మెట్ట‌ని దళవాయి సుబ్బరామయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్ర‌ధానోపాధ్యాయులు ఎం.కోట‌య్య విద్యార్థుల‌కు సూచించారు. విధ్యాధ‌ర‌పురం కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌లో ఉన్న దళవాయి సుబ్బరామయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన సమావేశం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు కోట‌య్య మాట్లాడుతూ మాట్లాడేశక్తి ఉండటం వలన మనిషి ఇతర జీవులకంటే ప్రత్యేకంగా అభివృద్ధి చెందాద‌ని అది కేవ‌లం భాష వల్లనే సాధ్యపడిందని తెలిపారు. మాతృభాష మనిషి ఎదుగుదలకు మొదటి మెట్టు అన్నారు. ప్రపంచంలోని ప్రతివ్యక్తికి ఒక మాతృభాష ఉంటుందని ఆ మాతృభాషలో మొదటగా ప్రతి విద్యార్ధి పట్టుసాధించాలని తద్వారా ప్రాపంచికమైన అన్ని విషయాలను ఆకళింపు చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని జరుపుంటామని అలా జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని విద్యార్ధులందరూ గ్రహించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్ణయించడం వెనుక కారణాలను, బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సంఘటనలను వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల తెలుగు బోధకులు ఆర్.బి.ఉదయకిరణ్ మాట్లాడుతూ మాతృభాషను ప్రేమించడంతో పాటు మన చుట్టూ ఉండే ఇతర మాతృభాషా వ్యక్తులను కూడా గౌరవించాలని, మన మాతృభాషలో విశేష కృషి చేసి గొప్ప వ్యక్తులుగా కీర్తించబడిన వారి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని హిత‌వు ప‌లికారు. మాతృభాషా పఠనంలో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠ‌శాల ఉపాధ్యాయులు సి.హెచ్.వసంతలక్ష్మి, ఎమ్.విజయలక్ష్మి, రంగమ్మ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ‌తెలుగు భాష అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసిన మహనీయుల చిత్రపటాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Just In...