Published On: Mon, Feb 22nd, 2021

ప్ర‌పంచ వ్యాప్తంగా సమాజ సేవలో సుదీర్ఘ స్కౌట్ ఉద్యమం…!

* ఫిబ్ర‌వ‌రి 22న సంస్థ వ్యవస్థాపకుడు రాబర్ట్ స్టీఫెన్సన్ జ‌యంతి ‌

* మ‌హిళ‌ల స్పోర్ట్స్ విభాగంలో స్మిత్ బెడెన్ పావెల్ పాత్ర ప్ర‌శంస‌నీయం

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: పుష్కరాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రస్తుత కోవిడ్ సమయంలో లేదా దేవాలయాల్లో ఉత్సవాల సందర్భంలో స్వచ్చందంగా ప్రజలకు సేవ చేసే యువకుల్ని చూస్తుంటాం. వీరు ఒక ప్రత్యేక యూనిఫామ్‌ని ధరించి మెడలో స్కార్ఫ్‌తో ఉండి వృద్ధులకి, పిల్లలకి సహాయం చేస్తూ, అవసరమైన చోట క్యూ లైన్లను పాటించడంలో నిర్వాహకులకు సహకరిస్తుంటారు. ఇలాంటి యువకులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకి చెందినవారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు రాబర్ట్ స్టీఫెన్సన్ స్మిత్ బెడెన్ పావెల్. ఈయన బ్రిటిష్ దేశస్థుడు. 1857 వసంవత్సరంలో ఫిబ్రవరి 22న జన్మించాడు. బ్రిటిష్ సైన్యంలో అధికారిగా పనిచేసే రోజుల్లో 1899 – 1900 మధ్యలో ఓ సంఘటన జరిగింది. ఆఫ్రికాలోని మాఫికింగ్ ప్రాంతం నల్ల జాతీయుల ఆధీనంలో ఉండి, బ్రిటిష్ సైన్యానికి యుద్ధ సమయంలో అవరోధంగా ఏర్పడింది. మాఫికింగ్‌ని ముట్టడించటానికి బెడెన్ పావెల్‌ని పంపారు. ఆయన అక్కడి పరిస్థితిని గమనించి, స్థానికుల సహకారంతో మాఫికింగ్‌ని స్వాధీనపరచుకోవచ్చని భావించాడు. ఆ ప్రాంతంలో అల్లరిచిల్లరగా తిరుగుతున్న 12-15 సంవత్సరాల మధ్య వారికి గూఢచర్యల్లో కొద్దిపాటి శిక్షణనిచ్చి, వాళ్ళిచ్చిన సమాచారంతో మాఫికింగ్ ని సులువుగా స్వాధీన పరచుకొని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి గౌరవం పొందాడు. యువకుల్లో కనబడని శక్తి దాగి ఉందని, వాళ్ళకి సరైన శిక్షణనిస్తే, వాళ్ళు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, బాధ్యతాయుత పౌరులుగా తయారౌతారనే నమ్మకం కలిగింది. ఈ నమ్మకాన్ని దృడం చేసుకోవటానికి, కొంతమంది విద్యావేత్తలతో, మానసిక శాస్త్ర నిపుణలతో యువకులకి ఒక శిక్షణని చ్చే ఆలోచనతో సంప్రదించాడు. అదే సమయంలో సమాజంలోని యువతలో మానవతా విలువలు విద్యావిధానంలో మార్పులు అవ‌సరమని, దేశభక్తి సమాజసేవ, మంచి ప్రవర్తన కొరవడుతున్నాయని, ప్రపంచ దేశాలు ఆందోళన చెందటం గమనించి, యువతకోసం ఒక కార్యాచరణని రూపొందించాలనుకొన్నాడు. యువకులకు కావాల్సిన ఈ అవసరాల్ని గుర్తించి, వీరికి బాల్యం నుంచే విలువలతో కూడిన ప్రత్యేక శిక్షణనిచ్చి, వాళ్ళని సమర్ధతో కూడిన ఉన్నత పౌరులుగా తయారు చేయటానికి ఈ ఉద్యమాన్ని స్కౌట్స్ పేరుతో స్థాపించాలని సంకల్పించాడు. యువతని శారీరకంగానూ, మానసికంగానూ, ఆధ్యాత్మికంగాను, సామాజికంగానూ అభివృద్ధి చేసి, సమర్ధవంతమైన భావి పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ఎన్నో ఆకర్షణీయమైన కార్యకలాపాల్ని రూపొందించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి ఇచ్చే శిక్షణ క్రమమైన స్వీయ విద్య. ఈ పద్ధతిలో ప్రతి 24 మంది స్కౌట్స్ లేదా గైడ్స్‌ని ఒక యూనిట్‌గా పరిగణనలోకి తీసుకొని ఒక స్కౌట్ మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ నిస్తారు.యువకుల అవసరాల్ని తీర్చేవిధంగా, లక్ష్య సాధన దిశగా వారికి ఆకర్షణీయమైన కార్యకలాపాల్ని రూపొందించటంలో యువకుల్ని భాగస్వాములుగా చేస్తారు. ఇందువలన ఆ శిక్షణలో వాళ్ళు ఆసక్తితో పాల్గొని, పూర్తిచేసుకుంటారు. ఈ నేపథ్యంలో బెడెన్ పావెల్ ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత 1907 వ సంవత్సరంలో లండన్‌కి సమీపంలో బ్రౌన్ సీ ద్వీపంలో ఒక ప్రయోగాత్మక శిక్షణా శిబిరాన్ని ప్రారంభించాడు.
శిక్షణ‌కి సమాజంలోని వివిధ వర్గాల కుటుంబాలనుంచి 12 -15 సంవత్సరాల మధ్య వయస్సుగల యువకుల్ని ఎంపికచేసి వాళ్లకి ఎనిమిది రోజుల పాటు ప్రాణరక్షణ, ఆరోగ్యం , పరిశీలన, పర్యావరణం, దేశభక్తి మొదలైన అంశాల్లో ఆయన స్వయంగా ఆచరణాత్మక శిక్షణనిచ్చాడు. శిక్షణలో అమిత ఆసక్తి తో చురుకుగా పాల్గొని అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగారు. అటు తర్వాత బెడెన్ పావెల్ ప్రయోగాత్మక శిబిరంలో తన అనుభావాల్ని, తాను యువతలో గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని, తాను కొంతమంది పెద్దలతో సంప్రదించిన అనుభావాల్ని, ఆర్మీలో తన అనుభవాల్ని జోడించి ‘స్కౌటింగ్ ఫర్ బాయ్స్’ పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన కొద్దినెలల్లోనే కొన్ని వేలమంది యువకులు ప్రభావితులయ్యారు. ఫలితంగా స్కౌట్ ఒక ఉద్యమంగా ఊపందుకుంది. 1909వ సంవత్సరంలో లండన్‌లోని క్రిస్టల్ ప్యాలస్ సమావేశంలో సుమారు 11000 మంది స్కౌట్స్ యూనిఫామ్ లో అత్యంత క్రమశిక్షణతో హాజరయ్యారు. ఆ సమావేశంలో చాలామంది ఆడపిల్లలు, మగ పిల్లల యూనిఫామ్‌లో హాజరవడం అందర్నీ ఆశ్చర్యపరచింది. వారి కోరిక మేరకు బెడెన్ పావెల్ ఆడపిల్లల కోసం ‘ గైడ్’ ఉద్యమాన్ని ఆవిష్కరించి, ఆయన భార్య ఓలివ్‌ని గైడ్ విభాగానికి అధిపతిగా చేసి, తాను స్కౌట్ విభాగానికి అధిపతిగా వుండ‌టం చేత వారిద్దరి పర్యవేక్షణలో స్కౌట్ -గైడ్ సంస్థ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రస్తుతం స్కౌట్-గైడ్ ఉద్యమం సుమారు 156 దేశాల్లో 56 మిలియన్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే యూనిఫామ్‌లో అతి పెద్ద స్వచ్చంద సంస్థగా ప్రపంచశాంతి కోసం పనిచేస్తోంది. స్కౌట్-గైడ్ సంస్థ ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు. మతపరమైనది కాదు. కానీ, ప్రతి స్కౌట్-గైడ్ దైవమందు కానీ, ధర్మమందు కానీ విశ్వాసం కలిగివుండాలి. ప్రతి స్కౌట్, గైడ్, ఉదయం కాలకృత్యాల తర్వాత విధిగా శరీర వ్యాయామం చేయాలి. శిరస్సునుంచి పాదాలవరకు ఆరు వ్యాయామాలు నిర్ణయించబడ్డాయి. సాయంత్రం ఆటలు ఆడాలి. స్కౌట్ గైడ్ కార్యక్రమాలన్నీ బహిరంగంగా చేయాలి. దీనివలన శరీరం ధృడ పడుతుంది. ఆటల వలన ఆరోగ్యకరమైన పోటీతత్వం ఏర్పడుతుంది. స్నేహ వాతావరణం ఏర్పడి, రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. భుజించేటప్పుడు దైవ ప్రార్ధన చేయాలి. దీనివల్ల చిన్నవయస్సు నుంచే ఇష్టదైవం మందు విశ్వాసం, పెద్దల ముందు గౌరవం అలవడతాయి. సర్వమత ప్రార్ధనలో పాల్గొనటం శిక్షణలో ఒక భాగం. దీనివలన పరమత సహనం, తన మతం యందు విశ్వాసం, అన్య మతాల యందు గౌరవభావం ఏర్పడుతాయి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకాన్ని శిక్షణా శిబిరంలో ప్రతిరోజూ ఎగురవేస్తారు. జాతీయ గీతాలాపన, జాతీయ పతాకమందు గౌరవం తప్పనిసరి. యూనిఫామ్ పర్యవేక్షణ, డ్రిల్ నిత్య కార్యక్రమాల్లో భాగం. వీటివలన, దేశభక్తి, క్రమశిక్షణ, మంచి నడవడి, అభివృద్ధి చెందుతాయి. ప్రథమ చికిత్స శిక్షణలో భాగం. దీనివలన ఆపదలో వున్నవారిని వెంటనే ఆడుకొనే మనస్తత్వం ఏర్పడుతుంది. శిబిరంలో కొన్ని రోజులు శిక్షణకి హాజరైనప్పుడు అందరు టెంట్ల లో వుంది, వివిధ ప్రదేశాలనుంచి వచ్చిన వారితో సహజీవనం చేయటంవలన సమైక్యతా భావం, కలసి జీవించటం, పరస్పర అవగాహన, మైత్రి ఏర్పడి ఒకరికొకరు ఆలోచనల్ని పంచుకోవటం, సృజనాత్మక శక్తి అలవడతాయి. మట్టి, మైనం, సుద్ద మొదలైనవాటితో బొమ్మలు, నమూనాలు, ఇతర వస్తువుల తయారీ వలన శ్రద్ధ, సృజనాత్మక శక్తి కళానైపుణ్యం, హస్తకళల యందు ఆసక్తి కలిగి, జీవనోపాధికి పనికొస్తాయి. స్కౌట్ శిక్షణలో సాంఘిక సేవకి ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగా స్కూలు, పార్కు, కాలనీలలో కానీ చెట్లు నాటటం, శుభ్రం చేయటం, ప్లాస్టిక్ నిషేధం మొదలైన వాటిలో పాల్గొనటం చేత స్వార్ధరహిత జీవనం అలవాటవుతుంది. ఇలాంటి సేవల వలన, దేశాభ్యున్నతికి నిస్స్వార్థంగా సేవ చేయడం సాధ్య‌మౌతోంది. శిక్షణ శిబిరంలో రాత్రిపూట కామ్‌ఫైర్‌లో పాల్గొనటం చేత కళలయందు ఆసక్తి, విభిన్న సంస్కృతులు యందు గౌరవభావం, వారిలోని సృజనాత్మకతని ప్రదర్శించే అవకాశమేర్పడుతుంది. ఈవిధంగా శిక్షణలో అడుగడుగునా మరెన్నో కార్యకలాపాలతో వాటి లక్ష్యాల దిశగా బాలబాలికలు, యువకులు బిజీగావుంటారు. వీరందరికి శిక్షణ విద్యాలయాల్లో వారానికి మూడు రోజులు గంట పాటు, రెగ్యులర్ విద్యకి అవరోధం కాకుండా ఇస్తుంటారు. ఐదేళ్ల బాలబాలికలతో స్కౌట్, గైడ్ శిక్షణ ప్రారంభమై , 25 ఏళ్ళ వరకు ఉంటుంది. వయస్సుతోపాటు, కార్యకలాపాల స్థాయి
పెరుగుతుంటుంది. బిడెన్ పావెల్ 22 ఫిబ్రవరి న 1857లో జన్మించాడు. ఆయన భార్య జన్మదినం కూడా అదే రోజైంది. వీరిద్దరి జన్మదినం ప్రపంచమంతటా స్కౌట్స్, గైడ్స్, థింకింగ్ డే గా వివిధ సాంఘిక సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం, థింకింగ్ డే థీమ్‌గా, ‘శాంతిని నెలకొల్పటం’ నేపథ్యంలో జరపాలని ప్రపంచ గైడ్ సంస్థ నిర్ణయించింది. ఆ రోజున స్కౌట్స్ గైడ్స్, రోవర్స్, రేంజర్స్, పెద్దలు, వయస్సుతో నిమిత్తం లేకుండా వారి ప్రతిజ్ఞని మ‌రోసారి గుర్తు చేసుకుని సమాజ సేవకి పునరంకితమవుతారు. ఇది యువత కోసం ఏర్పడిన ఉద్యమం. ఇటువంటి ఉద్యమానికి యువత ఊపిరి. తల్లిదండ్రులు ఇంతటి ఉద్యమాన్ని ప్రోత్సహించి ఉత్తమమైన పౌరులను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. సుమారు 115 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ సుదీర్ఘ ఉద్యమం భావితరాలకు బంగారు బాట కావాలి. అప్పుడే దేశం పటిష్టంగా ఉంటుంది. ప్రపంచశాంతి వర్ధిల్లుతుంది.

Just In...