పురపాలక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
* జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీసీలో ఎస్ఈసీ రమేష్‌కుమార్
విజయవాడ, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి సర్వసన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీఎస్, కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, డిజిపి గౌతమ్‌సవాంగ్, ఇతర ఉన్నత అధికారులతో కలిసి మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడలోని స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్, ఎన్నికల పరిశీలకులు జెవిఎన్.సుబ్రమణ్యం, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, వీయంసి కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, డిఆర్వో యం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ మార్చి 2 నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి సర్వసన్నద్ధం కావాలన్నారు. పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల స్లిప్పులను వారికి అందించాలన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి ఇది దృహదపడుతుందన్నారు. ఒత్తిడిలో నామినేషన్ల ఉపసంహరించుకున్నవారి విజ్ఞప్తులపై, పురపాలక నామినేషన్లు వేయలేకపోయిన వారు రుజువు చూపాల్సిన అవసరం ఉందన్నారు. అందరి హక్కులను కాపాడే బాధ్యత రాష్ట్రా ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణలో సమర్థత, చాకచక్యంతో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వారి యంత్రాంగం పూర్తి అంకితభావంతో పనిచేశారని ఎస్ఈసి రమేష్‌కుమార్ అభినందించారు. సమావేశంలో వీయంసి అదనపు కమిషనర్ యు.శారదాదేవి, మచిలీపట్నం కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, పెడన, నూజివీడు, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు మున్సిపల్ కమిషనర్లు యం.అంజయ్య, ఎన్.ఏ.రషీద్, టివి రంగరావు, ఎస్ జయరాం, బివిఆర్‌ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.