Published On: Thu, Feb 25th, 2021

అరుదైన సమస్యకు అత్యాధునిక శస్త్రచికిత్సతో పరిష్కారం

* ఆహారం మింగుడు ప‌డ‌క మహిళకు తీవ్ర అస్వస్థత

* ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ పవన్ వెలినేని ఆధ్వర్యంలో లాపరోస్కోపీ శస్త్రచికిత్స

* శ‌స్త్ర‌చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి రెండో రోజునే డిశ్చార్జి

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: అత్యాధునిక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన కామినేని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్య నిపుణులు.. అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళను కోలుకునేలా చేశారు. కృష్ణలంకకు చెందిన 48 ఏళ్ల మహిళ గత నాలుగేళ్లుగా ఆహారం మింగలేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటోంది. తన ఆనారోగ్య సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో కామినేనిలోని అత్యాధునిక సర్జికల్ గ్యాస్ట్రో విభాగం గురించి తెలుసుకుని డాక్టర్ పవన్ వెలినేనిని సంప్రదించారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు కలిగిన కామినేనిలో రోగికి అవసరమైన పరీక్షలు జరిపి అన్నవాహిక చివరి భాగంలో కండ గట్టిబడటమే సమస్యకు కారణమని వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ పవన్ వెలినేని నేతృత్వంలోని వైద్య బృందం రోగికి లాపరోస్కోపీ విధానంలో అతి చిన్న రంధ్రాలతో విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆపరేషన్ పూర్తైన కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రోగి సాధారణ స్థితికి చేరుకోగలిగింది. రోగి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆపరేషన్ రెండో రోజునే ఆసుపత్రి నుండి ఆమెను డిశ్చార్జి చేయడం విశేషం. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. డాక్టర్ పవన్ వెలినేని మాట్లాడుతూ ఎండోస్కోపీ, మానోమెట్రీ, 24 పీహెచ్ స్టడీ తదితర పరీక్షల అనంతరం రోగి ఎకలేషియా కార్డియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అన్నవాహిక చివరి భాగంలో కండ గట్టిబడటం వల్ల ఆహారం మింగడంలో ఇబ్బంది ఏర్పడుతుందని, ముఖ్యంగా ద్రవపదార్థాలు తీసుకోవడం అత్యంత కష్టంగా మారుతుందని అన్నారు. పరీక్షా ఫలితాలతో పాటు, రోగి తెలిపిన వివరాలను సమీక్షించి సమస్యను నిర్ధారించి, రోగికి లాపరోస్కోపీ సర్జరీ చేసి సమస్యను పరిష్కరించామని వివరించారు. కామినేనిలోని అత్యాధునిక సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ద్వారా ఉదర సంబంధ సమస్యలన్నింటీకీ సమగ్రమైన చికిత్సలను అందిస్తున్నామని పవన్ వెలినేని వెల్లడించారు. సీటీ, ఎంఆర్ఐ, లాపరోస్కోపీ, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సీపీ తదితర ఆధునిక సదుపాయాలు కామినేనిలో అందుబాటులో ఉన్నాయని, మెట్రో నగరాలకు తరలివెళ్ళాల్సిన అవసరం లేకుండా కామినేనిలోని సర్జికల్ గ్యాస్ట్రో విభాగం ద్వారా అతి తక్కువ ధరలకు అత్యాధునిక వైద్య చికిత్సలను అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల మాట్లాడుతూ అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యకు విజయవంతంగా చికిత్స అందించిన డాక్టర్ పవన్ వెలినేని బృందానికి అభినందనలు తెలిపారు. కామినేని సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, డాక్టర్ గొర్తి గణేష్, డాక్టర్ పవన్ వెలినేని, జనరల్ సర్జన్లు డాక్టర్ దిలీప్, డాక్టర్ దీప్తిలతో కూడిన నిష్ణాతులైన వైద్య బృందం రోగులకు సేవలందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటుందని అన్నారు.

Just In...